జనగణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళీకేరి, జనగణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇండ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. మే 11 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియపై అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారతి హోళీకేరి, అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇండ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆమె ఆదేశించారు.
హౌస్ లిస్టింగ్ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా బ్లాక్ లను రూపొందించడం, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు.
అధికారులు క్షేత్ర స్థాయిలో పక్కాగా పర్యవేక్షణ చేయాలని, తద్వారా అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చూడాలని భారతి హోళీకేరి తెలిపారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.












