పాఠశాలలకు తరచుగా ఆలస్యంగా వస్తున్న ఉపాధ్యాయులపై విద్యాశాఖ కఠిన చర్యలు తీసుకోనుంది. సమయపాలన, క్రమశిక్షణ పాటించని వారిపై చర్యలు తీసుకోవడానికి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRAS) ను తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఉద్యోగులంతా FRAS ను నమోదు చేసుకోవాలి. నెలవారీ హాజరు లెక్కింపులో దీనిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారి సాధారణ సెలవులు (CL) కోత విధిస్తారు. అవి అయిపోయిన తర్వాత ఆర్జిత సెలవులలో (EL) కోత విధిస్తారు.
ఉద్యోగులు ఉదయం 10.40 గంటల లోపు FRAS యాప్‌లో లాగిన్ అవ్వాలి. 10.41 నుండి 11.30 గంటల మధ్య వచ్చేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. నెలలో మూడు రోజులు ఆలస్యంగా వస్తే ఒక CL కోత విధిస్తారు. అలాగే, సాయంత్రం 5 గంటల తర్వాతే కార్యాలయాలు వదిలి వెళ్లాలి. 4 గంటలలోపు వెళితే ఒక పూట ఆఫ్‌డే లేదా CL గా పరిగణిస్తారు.
వరుసగా మూడు రోజులు ముందుగా కార్యాలయం వదిలి వెళితే ఒక CL గా పరిగణిస్తారు. శాఖాపరమైన పని ఉంటే సంబంధిత అధికారి అనుమతి తప్పనిసరి. లేదంటే డుమ్మా కొట్టినట్లుగా పరిగణించి సెలవులు లేదా జీతం కోత విధిస్తారు. కార్యాలయ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎస్టాబ్లిష్మెంట్ అధికారులు ఈ హాజరు, సెలవుల ఖాతాలను నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని బోధనేతర సిబ్బందికి FRAS హాజరు తప్పనిసరి కాగా, ఇదే నిబంధనలను రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీచర్లకు FRAS అమలు చేస్తున్నా, సెలవులు, జీతానికి కోత పెట్టడం లేదు. అయితే, కొందరు టీచర్లు తరచుగా గైర్హాజరవుతున్న నేపథ్యంలో, ఈ నిబంధనలను కఠినతరం చేసే అవకాశం ఉంది. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లాలో 76 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.











