తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలకు నిజమైన న్యాయం జరిగిందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. టీడీపీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు బీసీ వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించారని ఆయన తెలిపారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే వెనుకబడిన తరగతుల (బీసీ) కులాలకు నిజమైన న్యాయం జరిగిందని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయాల్లో బీసీ వర్గాలకు ప్రాధాన్యం కల్పించిన మహానాయకుడని ఆయన తెలిపారు. బీసీలను గుర్తించి, వారిని చట్టసభల్లో రాణించేలా అవకాశాలు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని అంబికా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే జిల్లా పరిషత్‌లలో బీసీలకు చైర్మన్ పదవులు లభించాయని ఆయన గుర్తు చేశారు.
నిన్న జరిగిన బీసీ గర్జన సభలో వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. బీసీల ఎదుగుదలకు కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎన్టీఆర్ చూపిన మార్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఆదరణ-1, ఆదరణ-2, ఆదరణ-3 వంటి పథకాల ద్వారా వృత్తి ఆధారిత కులాలకు పనిముట్లు అందించి ఆర్థికంగా వారిని బలోపేతం చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు.
మన తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడు అచ్చెన్నాయుడు గారిని ఆసుపత్రిలో ఉన్న సమయంలో అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన ఘటనలను ప్రజలు మరచిపోలేరని, కొల్లు రవీంద్ర వంటి నాయకులను అరెస్ట్ చేసి రాజకీయ వేధింపులకు గురి చేసిన పరిస్థితులు గత పాలనలో చోటుచేసుకున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం సుమారు 51 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, మంత్రివర్గం, కార్పొరేషన్లు మరియు ఇతర కీలక పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని చెప్పారు. గత ఐదేళ్ల పాలనను ప్రస్తుత రెండు సంవత్సరాల పాలనతో పోల్చి చూస్తే ఎవరు బీసీలకు మేలు చేశారో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల అభివృద్ధికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, బీసీలను ఆర్థికంగా మరియు సామాజికంగా మరింత బలోపేతం చేయడమే పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. వైసీపీ నాయకులు టీడీపీపై అనవసర విమర్శలు చేయకుండా గతంలో చేసిన తప్పులకు బీసీలకు క్షమాపణ చెప్పాలని సూచించారు.








