(పీడీఎస్యూ) (ప్రశ్న ఆయుధం) జూలై 26
విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ, తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రిన్స్ డిమాండ్ చేశారు. రియాన్స్ కళాశాల యాజమాన్యం తమతో దురుసుగా ప్రవర్తించిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని, విద్యార్థి సంఘాల నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని వారు ఆరోపించారు.
విద్యార్థి సంఘాల నాయకులపై నమోదు చేసిన అక్రమ, తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) జిల్లా అధ్యక్షుడు ఆర్. గౌతమ్ కుమార్, జిల్లా కార్యదర్శి ప్రిన్స్ డిమాండ్ చేశారు.
ఆదివారం నగరంలోని కోటగల్లిలోని నీలం రామచంద్రయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో విద్యార్థి ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, విద్యార్థి సంఘాల నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా జిల్లాలో విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధ చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పందించాలని కోరారు.
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎఫ్డీఎస్యూ, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయని తెలిపారు. బంద్కు సహకరించాలని కోరుతూ నగరంలోని రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాలకు వెళ్లగా, కళాశాల యాజమాన్యం తమతో దురుసుగా ప్రవర్తించిందని ఆరోపించారు.
యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని, అయితే విద్యార్థి సంఘాల నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారని విమర్శించారు. ఈ కేసులను వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు, తప్పుడు ఫిర్యాదు చేసిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థి ఉద్యమాలను అడ్డుకునేందుకు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన వారు, తప్పుడు కేసులకు భయపడి విద్యార్థి ఉద్యమం ఎప్పుడూ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. రియాన్స్ కళాశాల యాజమాన్యం వ్యవహారాలపై ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు ఆకాష్, మనోజ్, పవన్, భవాని, శ్రీకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.











