కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి, స్వప్నలోక్ కాలనీలో గత 108 రోజులుగా లోక కళ్యాణాన్ని, ప్రజలందరి క్షేమాన్ని కాంక్షిస్తూ శ్రీరామ పారాయణం నిర్వహిస్తున్నట్లు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకులు శ్రీ హర్ష తెలిపారు. ఈ కార్యక్రమం మంగళవారం ముగియనుంది.
నవంబర్ 22న ప్రారంభమైన ఈ పారాయణం, 108 రోజుల పాటు కొనసాగింది. ఈ కాలంలో ప్రతిరోజూ హనుమాన్ చాలీసా, ప్రతి శనివారం రామరక్ష స్తోత్రం పారాయణాలు నిర్వహించారు. అలాగే, సహస్ర దీపాలంకరణ, రుద్రాభిషేకాలు వంటి విశేష పూజలను భక్తులు, కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు.
శ్రీరామ జయరామ, జయజయరామ అనే మంత్రోచ్ఛారణలతో ఈ దైవ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రజలందరిలోనూ శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సమస్త ప్రపంచం సుఖసంతోషాలతో ఉండాలని భక్తితో పూజలు చేస్తూ సీతారామచంద్ర స్వామిని ప్రార్థించడం జరిగిందని అర్చకులు శ్రీ హర్ష పేర్కొన్నారు.

