తెలంగాణ ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టేందుకు కీసర మండలం భోగారం గ్రామంలోని హోలీ ట్రినిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
కార్యక్రమంలో పాల్గొన్న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ జి.లింగయ్య, ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే మార్గాలు, ప్రత్యామ్నాయాలపై సమగ్ర సమాచారం అందించారు.
సుమారు 60 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్ దుష్ప్రభావాలపై విద్యార్థులు ప్రసంగాలతో పాటు, అవగాహన కల్పించే పోస్టర్లను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయ పర్యావరణ ఇంజనీర్ బి.రాజేందర్, ఏఈఎస్ జి.లింగయ్య, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.











