రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో 6 కేసులు నమోదు చేసి, కోటిన్నరకు పైగా విలువైన డాక్యుమెంట్లు, నగదు, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు, 15 ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం ఉదయం జిల్లావ్యాప్తంగా అనుమతులు లేకుండా అక్రమ వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో రూ.1,39,65,000/- విలువైన వివిధ రకాల డాక్యుమెంట్లు, రూ.1,77,000/- విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతులు లేకుండా అధిక వడ్డీలతో ప్రజలను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే వ్యాపారులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు. అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడకుండా, ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్ధతుల్లో ఫైనాన్స్ నిర్వహించే సంస్థలను మాత్రమే సంప్రదించాలని ప్రజలకు సూచించారు.
అక్రమ ఫైనాన్స్ వ్యాపారుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం చేయడం తమ లక్ష్యమని, అధిక వడ్డీలతో సామాన్యులపై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు.










