రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర నీటిపారుదల, పవర్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు, నీట్ పరీక్ష నిర్వహణ, ధాన్యం కొనుగోలు, ప్రజావాణి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల మాట్లాడుతూ, మే 4 నుంచి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిధ్యీకరణ, ప్రభుత్వ పథకాల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతు వారోత్సవాల్లో నేల నమూనాల సేకరణ, ఉద్యాన పంటల ప్రోత్సాహం, పంట రుణాలపై అవగాహన, వ్యవసాయ డ్రోన్ ప్రదర్శనలు, కుసుమ్ పథకం ప్రచారం, పశుసంవర్థక, మత్స్యశాఖ కార్యక్రమాలు, కాలువల శుభ్రత వంటి కార్యక్రమాలను నిర్వహించాలని పేర్కొన్నారు.
రాబోయే సీజన్లో సుమారు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా ఉండగా, 90 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు రైతులకు రూ.581.72 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ధాన్యం సేకరణలో ట్యాబ్ ఎంట్రీలు, రవాణా, కార్మికుల లభ్యత, గోనె సంచుల సరఫరా, హార్వెస్టర్ వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో పనితీరు తక్కువగా ఉన్న మండలాలను సందర్శించి పనుల పురోగతిని సమీక్షించాలని, ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 కూలీ ఆధారిత పనులు ఉండేలా చూడాలని, పనిస్థలాల్లో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని, లేకపోతే తిరస్కరణ కారణాలను తెలియజేయాలని సూచించారు. దరఖాస్తులను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసి రసీదు అందజేయాలని ఆదేశించారు. మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్ హాజరు, సీసీ కెమెరాలు, భద్రతా చర్యలు, వైద్య సిబ్బంది, నిరంతర విద్యుత్ సరఫరా, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జనగణన-2027లో భాగంగా మే 11 నుండి జూన్ 9 వరకు మొదటి విడత ఇండ్ల గణన చేపట్టనున్నట్లు జనగణన అధికారి భారతి హోళ్ళికేరి తెలిపారు. ఈ నెల 10 వరకు స్వీయ గణన కార్యక్రమాన్ని ప్రచారం చేయాలని సూచించారు.












