అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా సంగారెడ్డిలో జరిగిన వేడుకల్లో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు ఫ్యాక్టరీల శాఖల ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మలా జయప్రకాశ్ రెడ్డి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, వారి హక్కులను పరిరక్షించడం, భద్రత, న్యాయం కల్పించడం తమ బాధ్యత అని ఆమె అన్నారు. ప్రతి కార్మికుడు గౌరవప్రదమైన జీవితం గడిపేందుకు అవసరమైన అవకాశాలను కల్పించేందుకు కృషి కొనసాగుతుందని ఆమె హామీ ఇచ్చారు.
అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పాండు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. కార్మికులు భద్రతా నియమాలను పాటించాలని, ప్రమాదాలను నివారించడంలో అవగాహన కీలకమని చైతన్య రెడ్డి సూచించారు. జిల్లాలో కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తున్నామని పాండు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొందరు కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డులను అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్ రెడ్డి, అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.












