కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఆత్మస్థైర్యం, వేసవి జాగ్రత్తలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు.
కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ.ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాలు, సబ్-డివిజన్ DSP శ్రీ.మధు సుదన్ సార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం పోసానిపేటలో జరిగింది. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మాదక ద్రవ్యాల నిర్మూలన ఆవశ్యకత, సైబర్ నేరాలపై అప్రమత్తత వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని సూచనలు చేశారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతను కూడా వివరించారు.
సైబర్ నేరాల బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1930 అందుబాటులో ఉందని, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం సభ్యులు పాటలు, మాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












