కామారెడ్డి జిల్లాలో పీఎం శ్రీ పాఠశాలలకు కేటాయించిన నిధులను ఈ నెల 23వ తేదీలోగా పూర్తిగా వినియోగించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా అధికారులకు యోగితా రాణా ఈ సూచనలు చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పీఎం శ్రీ పాఠశాలల్లో చేపట్టిన సివిల్ పనులు, ఇతర అభివృద్ధి పనులను నిబంధనల ప్రకారం సకాలంలో పూర్తి చేసి, బిల్లులను వెంటనే ట్రెజరీకి సమర్పించాలని ఆమె ఆదేశించారు. ఇది నిధుల సకాలంలో విడుదలకు దోహదపడుతుందని తెలిపారు.
అవసరమైతే, ట్రెజరీ అధికారులతో సమన్వయం చేసుకుని, పూర్తయిన పనులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని సూచించారు. వారం రోజుల్లో పనులు పూర్తి చేసి, బిల్లులు సమర్పించడం ద్వారా నిధుల వినియోగాన్ని పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, టీఎస్డబ్ల్యూఐ ఇంజినీర్ సుబ్బారాయుడు, విద్యాశాఖ సమన్వయకర్తలు పాల్గొన్నారు.


