కామారెడ్డి జిల్లా పోలీసులు అమలు చేస్తున్న 'ఆపరేషన్ కవచ్' మరోసారి సఫలీకృతమైంది. లింగాపూర్ గ్రామంలో అర్ధరాత్రి జరిగిన ఇంటి దొంగతనం కేసును కొద్ది గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. డయల్-100 అలర్ట్, పోలీస్ కంట్రోల్ రూమ్, నైట్ పెట్రోలింగ్ బృందాల సమన్వయంతో ఈ కేసును వేగంగా పరిష్కరించారు.
దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో జూన్ 11 రాత్రి ఒక వ్యక్తి ఇంటి ముందు నిద్రిస్తుండగా, ఇంట్లోకి చొరబడిన దొంగ మొబైల్ ఫోన్, రూ.2,500 నగదును అపహరించుకుపోయాడు. బాధితుడు డయల్-100కు సమాచారం అందించడంతో, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. నిందితుడి దుస్తుల వివరాలను వైర్లెస్ ద్వారా అన్ని బృందాలకు పంపారు.
కామారెడ్డికి వెళ్లే మార్గంలోని వసుంధర వెంచర్ సమీపంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ కవచ్ చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను లింగాపూర్‌లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుంచి దొంగిలించిన మొబైల్, నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని రాథోడ్ బొజ్జు (45)గా గుర్తించారు. ఇతనిపై గతంలోనూ పలు దొంగతనం కేసులు నమోదై, జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు తెలిపారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసును వేగంగా ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించి నగదు బహుమతులు అందజేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు.












