నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం గ్రామ శివారులోని ఇటుక బట్టీలలో కనీస వసతులు లేకుండా వెట్టిచాకిరి చేస్తున్న నెల్లూరు జిల్లా కూలీల దుస్థితిపై జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారత లక్ష్మి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, మానవ హక్కుల ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్. భారత లక్ష్మి, ఆర్మూర్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి, సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వీయ, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి కలిసి ఇటుక బట్టీల వద్దకు చేరుకుని, కూలీలు నివసిస్తున్న తాత్కాలిక గుడిసెలను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు సైతం మండుటెండలో పనిచేస్తుండటాన్ని చూసి కలత చెందారు.
"ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోంది. కూలీలను బంధించి బలవంతంగా పనిచేయిస్తున్నట్లు అనిపిస్తోంది" అని జిల్లా జడ్జి వ్యాఖ్యానించారు. నెల్లూరు నుంచి కూలీలను తీసుకువచ్చిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కిరణ్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనే కాంట్రాక్టర్లు తమను ఇక్కడికి తీసుకొచ్చారని కూలీలు తెలిపారు.
కూలీలు నివసిస్తున్న గుడిసెలను 'పిచ్చుక గూళ్లు'గా అభివర్ణించిన జిల్లా జడ్జి, ఐదు నుంచి ఏడు అడుగుల స్థలంలో ఇటుకలు, కట్టెలతో గోడలు కట్టి, పైన రేకులు, ప్లాస్టిక్ కవర్లతో జీవిస్తున్నారని, పిల్లలను చిన్న గదుల్లో బంధిస్తున్నారని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "కేజీఎఫ్ సినిమాలో చూపించినట్లే ఇక్కడ కూలీల బతుకులు కనిపిస్తున్నాయి" అని ఆమె అన్నారు.
వెట్టిచాకిరి చేస్తున్న కూలీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన జిల్లా జడ్జి, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుంచి నల్లమట్టి తరలింపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని సూచించారు. తనిఖీల అనంతరం కూలీలందరినీ ఆర్మూర్ పునరావాస కేంద్రానికి తరలించి, వారి స్వగ్రామాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.











