ఈ నెల 28న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. క్షణావేశంలో జరిగిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న, రాజీకి అవకాశం ఉన్న కేసులలో కక్షిదారులు పరస్పర అవగాహనతో పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ దోహదపడుతుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవచ్చని వివరించారు.
సైబర్ నేరాల బాధితులు కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రూ.25,000/- లోపు నష్టపోయిన బాధితులు లోక్ అదాలత్లో ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ పొందే అవకాశం ఉందని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన, సులభమైన పరిష్కారం లభిస్తుందని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.








