కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముప్ట్ బిజిలి యోజన” పథకాన్ని గృహ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రావతి పిలుపునిచ్చారు. ఈ పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటే ఉచిత విద్యుత్ లభిస్తుంది.
పర్యావరణ పరిరక్షణతో పాటు గృహాలకు శాశ్వత విద్యుత్ పరిష్కారం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రచార వాహనాన్ని డీఆర్ఓ చంద్రావతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా రూపొందించబడిందని ఆమె తెలిపారు.
గృహ వినియోగదారులు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా 360 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని డీఆర్ఓ పేర్కొన్నారు. ఈ పథకం అమలు తీరు, ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు.
పథకానికి సంబంధించిన టారిఫ్, సబ్సిడీ మరియు అదనపు ఆదాయం వంటి వివరాలను అందించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయబడింది. హెల్ప్ డెస్క్ నంబర్లు 080-46733622, 46733633 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) అందుబాటులో ఉంటాయని వేణుగోపాల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.pmsuryaghar.gov.in ను సందర్శించవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాంబశివ రావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారి శేఖర్, ఫీల్డ్ ఆఫీసర్లు ఓం ప్రకాష్, విలాస్ రావు, ఆనంద్, సంతోష్, మోహమ్మద్ మజర్ తదితరులు పాల్గొన్నారు.











