తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన కలెక్టర్, అనంతరం మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) డి. విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి ఆర్.ఎస్. చంద్రావతి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి టి. ఝాన్సీరాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాంబశివరావు, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్ తో పాటు పలు శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాల్గొన్న అధికారులు బసవేశ్వరుని సేవలను స్మరించుకుంటూ, ఆయనకు భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు.











