మెదక్లో ప్రసవం తర్వాత శిశువును అక్రమంగా విక్రయించిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో ఆసుపత్రి నర్సు, శిశువును కొనుగోలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆసుపత్రి యజమాని పరారీలో ఉన్నాడు.
పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా అనే మహిళ, గర్భవతిగా ఉన్నప్పుడు మెదక్లో కోతుల దాడిలో గాయపడి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ శస్త్రచికిత్స ద్వారా ఆడశిశువు జన్మించింది. అయితే, ఆసుపత్రి నర్సు, శిశువు మరణించినట్లు తల్లికి నమ్మబలికింది.
కొద్ది రోజుల తర్వాత, శిశువు బతికే ఉందని తెలియడంతో, తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో, నర్సు అక్తరీ బేగం, శిశువును మధ్యవర్తి నౌసిన్ ఉన్నిసాకు అప్పగించి, ఆమె ద్వారా సిద్దిపేట దంపతులకు రూ.1.50 లక్షలకు విక్రయించినట్లు తేలింది.
పోలీసులు శిశువును స్వాధీనం చేసుకుని, సఖి కేంద్రానికి అప్పగించారు. నర్సు, మధ్యవర్తి, కొనుగోలు చేసిన దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆసుపత్రి యజమాని కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు ఆసుపత్రిని మూసివేశారు.











