నంద్యాల జిల్లా బనగానపల్లెలో లంచం తీసుకుంటున్న తహసీల్దార్ (ఎంఆర్ఓ) రాజీవ్ రెడ్డి, మండల సర్వేయర్ హుస్సేన్ భాషలను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రూ. 50,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.
బనగానపల్లె తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా, భూమిని పట్టా భూమిగా మార్చే ప్రక్రియలో భాగంగా లంచం తీసుకుంటున్నట్లు గుర్తించారు.
మొదటగా, మండల సర్వేయర్ హుస్సేన్ భాష రూ. 50,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం, ఆయన తహసీల్దార్ రాజీవ్ రెడ్డి సూచనల మేరకు డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది.
తహసీల్దార్ రాజీవ్ రెడ్డి కూడా డబ్బులు స్వీకరించడానికి సిద్ధపడటంతో, ఏసీబీ డీఎస్పీ సోమన్న నేతృత్వంలోని బృందం ఇద్దరినీ కార్యాలయంలోనే అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ అరెస్టులతో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై మరోసారి వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.











