మద్యం తయారీ కంపెనీలు ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల కారణంగా తమ ఉత్పత్తుల ధరలను పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గాజు బాటిళ్ల తయారీకి అవసరమైన గ్యాస్ ధరలు పెరగడం, అంతర్జాతీయ సరఫరాలో అంతరాయాలు దీనికి కారణమని నివేదికలు సూచిస్తున్నాయి.
మద్యం తయారీలో ప్యాకేజింగ్ ఖర్చు ప్రస్తుతం ఒక ప్రధాన భారంగా మారింది. స్పిరిట్స్ ప్యాకేజింగ్ ఖర్చు 20% ఉండగా, బీర్ల విషయంలో ఇది 40% వరకు చేరుకుంటుంది. ఈ గాజు బాటిళ్లను తయారుచేసే ఫర్నెస్లకు సహజ వాయువు (గ్యాస్) అత్యవసరం. భారతదేశం గ్యాస్ అవసరాల కోసం విదేశాలపై, ముఖ్యంగా ఖతార్‌పై, ఆధారపడటం వల్ల అంతర్జాతీయ పరిణామాల ప్రభావం నేరుగా పడుతోంది.
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగించింది. దీనితో గాజు బాటిళ్ల తయారీ ఖర్చు గణనీయంగా పెరిగింది. ఇండియన్ మాల్ట్ విస్కీ అసోసియేషన్ ప్రకారం, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల గాజు బాటిళ్ల ధర 15-20% పెరిగింది. అంతర్జాతీయ షిప్పింగ్ ఛార్జీలు కూడా పెరగడంతో, కంపెనీలు లాభాలను నిలబెట్టుకోవడానికి ధరల పెంపును తప్పనిసరిగా భావిస్తున్నాయి.
మద్యం కంపెనీలు ఒక్కో బ్రాండ్‌పై 10-15% ధరల పెంపును కోరుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ మద్యం ధరల్లో ఈ మార్పు త్వరలోనే కనిపించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
వేసవిలో బీర్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అయితే, గ్యాస్ లభ్యత తగ్గితే గాజు ఫర్నెస్‌లు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేవు. ఇది బాటిళ్ల కొరతకు దారితీయవచ్చు. ప్రస్తుతం పరిశ్రమలో ఏడాదికి 12-13 కోట్ల బాటిళ్ల కొరత ఉంది. అల్యూమినియం ధరలు పెరగడంతో బీర్ క్యాన్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే వినియోగదారులు తమకు నచ్చిన బ్రాండ్లు దొరక్క ఇబ్బంది పడాల్సి వస్తుంది.










