తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) పరిధిలో విద్యుత్ వినియోగం సరికొత్త చారిత్రక గరిష్ట స్థాయిని అందుకుంది. గురువారం నాడు సంస్థ పరిధిలో ఏకంగా 6,457 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇది సంస్థ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కర్నాటి వరుణ్ రెడ్డి వెల్లడించారు.
గత మార్చి 3, 2026 నాడు నమోదైన 6,441 మెగావాట్ల రికార్డు డిమాండ్‌ను అధిగమిస్తూ, మరో 16 మెగావాట్ల అదనపు డిమాండ్‌తో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు సీఎండీ తెలిపారు. ఈ విజయం సంస్థ నిర్వహణ సామర్థ్యానికి, వినియోగదారులకు అందిస్తున్న మెరుగైన, నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
వేసవి కాలం ఆగమనంతో పాటు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు విద్యుత్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని సీఎండీ వివరించారు. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్న నేపథ్యంలో ఇళ్ళు, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు, వ్యవసాయ పంపుసెట్లు అన్ని రంగాల్లో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా గృహ వినియోగదారుల వద్ద ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం అనూహ్యంగా పెరగడం ఈ రికార్డు డిమాండ్‌కు దోహదపడింది.
డిమాండ్ ఎంత పెరిగినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడమే తమ లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ సబ్స్టేషన్ల బలోపేతం, 24×7 నిఘా వ్యవస్థ, ఆపత్కాల స్పందన బృందాలు వంటి చర్యలు చేపట్టింది. ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్ లైన్లు, సబ్స్టేషన్ల సామర్థ్యం పెంచడానికి నిర్వహణ పనులు పూర్తి చేయబడ్డాయి. విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా వెంటనే స్పందించేందుకు రౌండ్-ది-క్లాక్ నిఘా బృందాలు మోహరించబడ్డాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడినా కనీస సమయంలో పునరుద్ధరించేందుకు అత్యవసర బృందాలు సన్నద్ధంగా ఉన్నాయి.
వేసవిలో అంటే ఏప్రిల్–మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సీఎండీ అంచనా వేశారు. అయినప్పటికీ, సంస్థ ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని, ఈ విద్యుత్ డిమాండ్‌ను అందుకోగలమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వినియోగదారులకు నాణ్యమైన సరఫరా అందించడమే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఈ రికార్డు సాధన ఎన్పీడీసీఎల్ సిబ్బంది కృషికి, సంస్థ నిర్వహణ నైపుణ్యానికి నిదర్శనమని సీఎండీ వరుణ్ రెడ్డి అభినందించారు.











