కూకట్పల్లిలోని హోసింగ్ బోర్డు ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి సునీతా మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సునీతా మహేందర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అమలు చేస్తోందని ఆమె తెలిపారు.
టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మహిళలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.

