తెలంగాణలో జీవో నంబర్ 317 వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను వారి స్వస్థలాలకు బదిలీ చేసి, వన్ టైం రిలీఫ్ కింద న్యాయం చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనంతరం, సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగులకు కొత్త జిల్లాల్లో పోస్టింగ్స్ ఇచ్చేందుకు జీవో నంబర్ 317ను 2021లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవో వల్ల వేలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆ జీవోను రద్దు చేసి, వారి సొంత జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ కు లేఖ రాశారని కవిత గుర్తు చేశారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నంబర్ 317ను సమీక్షించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిందని, ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ హామీని నొక్కి చెప్పిందని ఆమె తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న పలువురు నాయకులు కూడా ఇదే హామీ ఇచ్చారని కవిత పేర్కొన్నారు.
జీవో నంబర్ 317 బాధితుల సమస్యల పరిష్కారం కోసం అప్పటి సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ నివేదిక ఏమైందో ఇప్పటికీ అంతుచిక్కడం లేదని, ఆ నివేదికను బయటపెడితే బాధితుల సంఖ్యపై స్పష్టత వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడాలంటే, వెంటనే శాంతి కుమారి సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలని, జీవో నంబర్ 317 బాధితులకు వారు కోరుకున్న జిల్లాల్లో పోస్టింగ్స్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 వేల మందికి పైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిటైర్ అయ్యారని, ఆ ఖాళీల్లో అర్హులైన జీవో నంబర్ 317 బాధితులకు నిరుద్యోగులకు నష్టం కలగకుండా పోస్టింగ్స్ ఇవ్వాలని ఆమె సూచించారు. స్థానికంగా గుర్తించేందుకు ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నాలుగేళ్లు తెలంగాణలో చదువుకోవాలనే నిర్ణయం స్థానికతకు తీరని అన్యాయం చేస్తుందని, గతంలో మాదిరిగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ఏడేళ్లు తెలంగాణ లేదా సంబంధిత జిల్లాలో చదివితేనే స్థానికులుగా గుర్తించే పాత నిబంధనను మళ్లీ తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు.











