తెలంగాణలో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, యువతకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం జీవోల పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గ్రూప్-1 తరహాలోనే ఈ నియామకాలను కూడా తమ వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు.
బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన కవిత, డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ కు జీవో నంబర్ 4 అడ్డుగా వచ్చిందని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 నియామకాల్లో జరిగిన అక్రమాలను గుర్తు చేస్తూ, అదే పద్ధతిని ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ల నియామకాల్లోనూ అనుసరిస్తున్నారని ఆరోపించారు.
పీహెచ్డీ చేసిన వారికి 25 మార్కుల వెయిటేజీ, ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించడం వంటి నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కవిత విమర్శించారు. అసలు పీహెచ్డీ అడ్మిషన్లు లేని వారికి 25 మార్కుల వెయిటేజీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ (సెట్) ను మూడేళ్లుగా నిర్వహించకపోవడం వల్ల ఎంతో మందికి అన్యాయం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో నంబర్ 104 (డీఎస్సీ), జీవో నంబర్ 29 (గ్రూప్స్), జీవో నంబర్ 46 (పోలీసు ఉద్యోగాలు), జీవో నంబర్ 81 (గురుకులాల నియామకాలు), మరియు జీవో నంబర్ 4 (ఆడబిడ్డలకు రిజర్వేషన్లు రాకుండా) వంటి జీవోలను వెంటనే రద్దు చేయాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 40 లక్షల కుటుంబాల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వం వారి న్యాయం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ యువతను వాడుకుంటోందని కవిత ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాల హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులను ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం చేస్తామని హెచ్చరించారు.











