కామారెడ్డి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి భారీగా దొంగిలించిన వెండి నగలు, కాపర్ వైర్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, అడ్లూర్ గ్రామానికి చెందిన వడ్డే పద్మ ఇంటికి వెళ్లి చోరీకి పాల్పడినట్లు తెలిపారు. బీరువాలో ఉన్న సుమారు 3 తులాల బంగారు పుస్తెల తాడు, 15 తులాల వెండి నడుము గొలుసు, 15 తులాల వెండి బ్రాస్లెట్లు, 8 తులాల వెండి ముద్దలు, కొంత నగదును దొంగిలించారు. సమీపంలోని మరో ఇంట్లోనూ చోరీ జరిగినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా కనిపించిన సిద్దిపేట జిల్లాకు చెందిన నూనె నర్సింలు, ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, నిందితులు పలు మండలాల్లో ఇళ్లలో చోరీలు చేయడంతో పాటు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ కాయిల్స్, ఎర్త్ వైర్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 20 తులాల వెండి కాళ్ల పట్టీలు, వెండి ముద్దలు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.4,500 నగదు, 15 కిలోల కాపర్ వైరు, 10 కిలోల ఎర్త్ వైరు, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.












