జిల్లా కేంద్రంలో శనివారం మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ విక్టర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, అదనపు కలెక్టర్ విక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 11న పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని షబ్బీర్ అలీ తెలిపారు.
మహాత్మ జ్యోతిరావు పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. బాలికల విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన తొలి సంస్కర్తల్లో ఆయన ఒకరని, కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతూ సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణకు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్ ఉమారాణి, బిసి కార్పొరేషన్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.








