ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు.
సైబర్ నేరగాళ్లు బ్రాండెడ్ వస్తువులను భారీ డిస్కౌంట్లతో అందిస్తున్నట్లు నకిలీ ప్రకటనలు సృష్టించి ప్రజలను మోసం చేస్తున్నారని ఎస్పీ తెలిపారు. ఆన్లైన్లో డబ్బు చెల్లించిన తర్వాత వస్తువులు అందకపోవడమే కాకుండా, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
అసాధారణ డిస్కౌంట్లు, క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం లేకపోవడం, అనుమానాస్పద URLలు, నకిలీ వెబ్సైట్లు, ముందస్తు డబ్బు చెల్లింపు ఒత్తిడి వంటివి సైబర్ నేరగాళ్ల మోసపూరిత కుట్రలో భాగమని గుర్తించాలని ఎస్పీ సూచించారు. ప్రజలు ఆన్లైన్ పేమెంట్ చేసే ముందు వెబ్సైట్, URLలను జాగ్రత్తగా పరిశీలించాలని, పేజీ హిస్టరీ, ఫాలోవర్స్, రివ్యూలను తనిఖీ చేయాలని ఆయన సలహా ఇచ్చారు.
తెలియని స్పాన్సర్డ్ యాడ్స్‌పై క్లిక్ చేయవద్దని, సురక్షితమైన పేమెంట్ పద్ధతులను మాత్రమే ఉపయోగించాలని, OTPలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ షాపింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ప్రకటనలు, మోసపూరిత వెబ్సైట్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పునరుద్ఘాటించారు.
సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం ద్వారా గాని, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ cybercrime.gov.in లో గాని ఫిర్యాదు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. ఈ తరహా మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడం పోలీసుల బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.












