రామగుండం పోలీస్ కమీషనరేట్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్ ఫేజ్-3' కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'అరైవ్ అలైవ్ ఫేజ్-3' కార్యక్రమంలో భాగంగా, రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జైపూర్ సబ్ డివిజన్ లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం సోమవారం దుబ్బపల్లి ఫంక్షన్ హాల్ లో జరిగింది. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల భద్రతను ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ద్వారా ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, కంటి వైద్య శిబిరాలు వంటివి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు ఈ అవగాహనను తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సీపీ పిలుపునిచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వంటివి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వారి భవిష్యత్తుకు హానికరం అని, తల్లిదండ్రులు ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డుపై నడిచేవారిని గమనిస్తూ వాహనాలు నడపాలని తెలిపారు. కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని, రామగుండం కమిషనరేట్‌ను ప్రమాదరహిత ప్రాంతంగా మార్చడానికి అందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, జైపూర్ సీఐ నవీన్, చెన్నూర్ టౌన్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ, జైపూర్ ఎస్ఐ రాజశేఖర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











