జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. విద్యార్థుల సంరక్షణ, క్రమశిక్షణ, ఉన్నత విద్య లక్ష్యాలుగా ఉండాలని ఆమె సూచించారు.
పిల్లల సంరక్షణ చట్టాలు, ఫోక్సో చట్టం, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, బాల కార్మిక నిరోధక చట్టం, భారత రాజ్యాంగం వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని బి. సౌజన్య వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను కూడా ఆమె తెలియజేశారు.
ఎవరైనా న్యాయ సహాయం కోరితే ఉచితంగా అందిస్తామని, సంగారెడ్డిలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని బి. సౌజన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












