పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుమారుడు, వారసుడిగా భావిస్తున్న ముజ్తబా ఖమేనీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో, దేశ పాలనా పగ్గాలు పూర్తిగా మిలిటరీ చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
గత ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో ముజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, ఈ దాడుల్లో ఆయన భార్య, కుమారుడు మరణించారని సమాచారం. ముజ్తబా కాలికి తీవ్ర గాయమైందని, ఆయనకు మూడు శస్త్రచికిత్సలు జరిగినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన నడవడానికి కృత్రిమ కాలు అవసరమని, దాడుల వల్ల ముఖం, పెదాలు కూడా దెబ్బతినడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
తన బలహీనతను శత్రువులు పసిగడతారనే ఉద్దేశంతో, ముజ్తబా ప్రస్తుతం లిఖితపూర్వక ప్రకటనలకే పరిమితమయ్యారని, రహస్య ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఈ నాయకత్వ శూన్యతను భర్తీ చేసే క్రమంలో, ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం 'ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్' (IRGC) రంగంలోకి దిగినట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలోని కీలక నిర్ణయాలన్నీ ఐఆర్జీసీ జనరల్స్ అయిన అహ్మద్ వహీదీ, మొహమ్మద్ బాగేర్ వంటివారు తీసుకుంటున్నారని, దీంతో ఎన్నికైన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రభుత్వం నామమాత్రంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పౌర ప్రభుత్వం కేవలం ఆహారం, ఇంధనం, అంతర్గత శాంతిభద్రతలకే పరిమితమైందని, విదేశీ సంబంధాలు, వ్యూహాత్మక నిర్ణయాల్లో ప్రభుత్వానికి అధికారం లేకుండా పోయిందని తెలుస్తోంది.
ముజ్తబా ఖమేనీ తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు ఇరాన్ పూర్తిగా మిలిటరీ కనుసన్నల్లోనే నడిచే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ దేశాల్లో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీస్తాయేమోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.










