కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, చిరు వ్యాపారులను పట్టించుకోలేదని ఆరోపించారు.
కూకట్పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి రమేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన 10 సంవత్సరాల పాలనలో కూకట్‌పల్లికి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ చేయలేదని ఆరోపించారు. 90% అభివృద్ధి జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే, ఒక్క ప్రాజెక్టును నియోజకవర్గంలో చూపించాలని సవాలు విసిరారు.
చిరు వ్యాపారులపై కపట ప్రేమ చూపిస్తున్నారని, గతంలో వారి వ్యాపారాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఐడియల్ వద్ద ఉన్న 40 మంది చిరు వ్యాపారులను తొలగించినప్పుడు ఎమ్మెల్యే ఎందుకు స్పందించలేదని అడిగారు. వారికి పది ఎకరాలు ఇప్పించి మార్గం చూపించనప్పుడు, ఇప్పుడు మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదని పేర్కొన్నారు.
కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని, నియోజకవర్గ స్థాయిలో 11 నుంచి 120 మందికి పదవులు ఇప్పించామని తెలిపారు. టెంపుల్ కమిటీలు వేసుకుని పార్టీ ముందుకు వెళ్తోందని చెప్పారు. కూకట్పల్లి డిగ్రీ కాలేజీకి రూ.2.5 కోట్ల ఫండ్ తెచ్చి అభివృద్ధి చేస్తున్నామని, ఇంటర్ నుండి పిజి కాలేజీ వరకు అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని తెలిపారు. గతంలో శిలాఫలకం వేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని, క్రీడల కోసం పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, తాము కల్లబొల్లి కబుర్లు చెప్పి పక్కకు పోవడం లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే హయాంలో కూరగాయల మార్కెట్ భవనాలను తన అనుచరులతో కబ్జా చేయించారని, ఐడియల్ ల్యాండ్ అన్యాక్రాంతమైందని, హానర్ హోమ్స్‌లో ఎమ్మెల్యేకు ఇల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అధికారులను భయపెట్టి, బెదిరించి పని చేయించుకోవడం సరికాదని అన్నారు. 90% అభివృద్ధి జరిగితే ఎక్కడా ఏమీ కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలకు ఎమ్మెల్యేనే ఆధ్యుడని, తన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న స్వామి లేక్ పక్కన నాలాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు పదేళ్లలో ఎందుకు సహాయం చేయలేదని ప్రశ్నించారు.











