జిల్లాలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో, విద్యార్థులు పాటించాల్సిన నియమ నిబంధనలపై జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ కీలక సూచనలు జారీ చేశారు. చేయదగినవి, చేయకూడని వాటిని స్పష్టంగా వివరించారు.
జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, విద్యార్థులు తమ హాల్ టికెట్‌లోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, ఏవైనా తప్పులుంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావాలి. ఆన్సర్ బుక్‌పై ముద్రించిన సూచనలను పూర్తిగా చదవాలని, హాల్ టికెట్, OMR బార్కోడ్ షీట్‌పై ఉన్న నంబర్లు సరిపోలుతున్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు.
సరైన OMR షీట్‌ను స్వీకరించడం విద్యార్థి బాధ్యత అని, తప్పు బార్కోడ్ షీట్ ఫలితాల ప్రకటనలో లోపాలకు దారితీయవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు QR కోడ్‌ను స్కాన్ చేసి పరీక్షా కేంద్రం లొకేషన్, రూట్ వివరాలను ముందుగానే తెలుసుకోవాలని సూచించారు. హాల్ టికెట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలి.
పరీక్షా హాలులో నిశ్శబ్దాన్ని పాటించాలని, ఆన్సర్ బుక్‌లో ఎక్కడా పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ రాయకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి పుస్తకాలు, చీట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడం, నకలు చేయడం వంటివి చేస్తే మాల్ ప్రాక్టీస్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలని, వేరే కేంద్రంలో రాస్తే ఫలితాలు రద్దు చేయబడతాయని తెలిపారు. పరీక్షా హాలులో వస్తువుల మార్పిడి నిషేధమని, విద్యార్థులు ప్రశాంతంగా నియమ నిబంధనలు పాటిస్తూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.


