నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 'రైడింగ్ ది విండ్ క్లబ్' పేరుతో నకిలీ గ్రూపులో చేర్చి, స్టార్ మార్కెట్లో పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని నమ్మించి, ఒక ఐటీ ఉద్యోగి నుంచి రూ.2.92 కోట్లు కాజేసిన ఘటన కలకలం రేపుతోంది. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
సైబర్ నేరగాళ్లు తమ వలలో శ్రీకాంత్ చక్రవర్తి అనే ఐటీ ఉద్యోగిని పడేసుకున్నారు. 'స్టార్ మార్కెట్'లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు గడింకోవచ్చని ఆశ చూపారు. ఇందుకోసం ఒక ప్రత్యేకమైన యాప్‌ను డౌన్లోడ్ చేయించి, దాని ద్వారా పెట్టుబడులు పెట్టించారు.
మొదట్లో చిన్న మొత్తంలో, అంటే రూ.25 వేలతో పెట్టుబడి ప్రారంభించిన శ్రీకాంత్‌కు, యాప్‌లో లాభాలు వచ్చినట్లుగా చూపించారు. దీంతో, అతడిని మరింతగా నమ్మించి, ప్రముఖ కంపెనీల షేర్ల కొనుగోలు, అమ్మకాల పేర్లతో దశలవారీగా రూ.2.92 కోట్లు బదిలీ చేయించుకున్నారు. మొత్తం పెట్టుబడి రూ.3.5 కోట్లు అయినట్లు యాప్‌లో చూపించారు.
లాభాలను విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, డబ్బులు రాకపోవడంతో తాను మోసపోయానని శ్రీకాంత్ గ్రహించారు. వెంటనే, ఈ ఘటనపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. నేరగాళ్లను గుర్తించే పనిలో పడ్డారు.
ఇలాంటి ఆన్లైన్ పెట్టుబడి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద యాప్‌లను డౌన్లోడ్ చేయడం, తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేయడం వంటివి చేయవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.










