మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పొంగులేటిని 'బాంబులేటి', 'పొగరులేటి' అని ఎద్దేవా చేసిన ఆయన, అవినీతి బాగోతాలను తామే బయటపెట్టామని స్పష్టం చేశారు.
సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి మాటలు నిజాలను దాచి అబద్ధాలు మాట్లాడాయని, ఆయనలో సరుకు లేనందునే తిట్ల దండకం అందుకున్నారని ధ్వజమెత్తారు. పొంగులేటి క్రషర్లో జరిగిన అవినీతిని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా బయటపెట్టారని, తామే అన్ని విషయాలు వెలుగులోకి తెస్తామని సీఎం చెప్పారని గుర్తు చేశారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ, మంత్రులు జూపల్లి కృష్ణారావు, మల్లు భట్టి విక్రమార్క, సీఎం సోదరుల అవినీతి బాగోతాన్ని పొంగులేటినే బయటపెట్టారని ఎద్దేవా చేశారు. ఆయన పొంగులేటి కాదు 'పొంగులూటీ' అని వ్యంగ్యంగా మాట్లాడారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు అనుమతులు లేవని అధికారులు నివేదిక ఇచ్చారని, అధికారులు, సీఎం చెప్పింది తప్పా లేక పొంగులేటి చెప్పింది తప్పా అని ప్రశ్నించారు. ఇదంతా మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నమని ఆరోపించారు.
తాము ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాతనే రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందిన కంటైనర్‌పై రంగు వేసి, కాంగ్రెస్ జెండా తీసేశారని హరీశ్‌రావు ఆరోపించారు. కేసీఆర్ హయాంలో నాదర్గుల్ భూములను 22 ఏళ్లలో పెట్టి రక్షించామని, ఈ భూములను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఇవి ప్రభుత్వ భూములు అయితే ఆక్రమణ దారులపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు.
రెవెన్యూ మంత్రిగా పొంగులేటి ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రా పంపించి, కాంపౌండ్ వాల్ కూలగొట్టి, ఆక్రమణలను కూల్చి రేవంత్‌రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో రైతులకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేశారు.











