ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసింది. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం, జిల్లాలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 14 నుంచి 21కి పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత నియోజకవర్గాల సంఖ్యను పెంచాలనే ప్రతిపాదనలు జిల్లా రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. గతంలో జరిగిన పునర్విభజనలో కొన్ని నియోజకవర్గాలు రద్దు కాగా, మరికొన్ని కొత్తగా ఏర్పడ్డాయి. ఈసారి జరగబోయే మార్పులు జిల్లా రాజకీయ స్వరూపాన్ని గణనీయంగా మార్చే అవకాశం ఉంది.
తిరుపతి జిల్లాలో, తిరుపతి రూరల్, రామచంద్రపురం మండలాలను కలిపి ఒక కొత్త నియోజకవర్గంగా ఏర్పాటు చేయవచ్చని, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధిక ఓటర్ల సంఖ్య దృష్ట్యా రేణిగుంట కేంద్రంగా మరో కొత్త సీటు ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. గతంలో రద్దయిన పుత్తూరు నియోజకవర్గం కూడా తిరిగి తెరపైకి రానుంది.
పశ్చిమ ప్రాంతంలోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యం, పీలేరు నియోజకవర్గం నుంచి కలికిరి కేంద్రంగా కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీ స్థానాలతో పాటు, ఒక లోక్సభ స్థానం కూడా పెరిగే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రెండు లోక్సభ స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్ కాగా, కొత్తగా ఏర్పడేది జనరల్ కేటగిరీ కావచ్చని అంచనా.











