గుమ్మడిదల మున్సిపాలిటీ మరియు మండల పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాల కింద మంజూరైన 26 లక్షల రూపాయల విలువైన చెక్కులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ పథకాలు ఆడపిల్లల వివాహ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రవేశపెట్టబడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు.
గురువారం ఉదయం గుమ్మడిదల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతను పాటిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రయోజనాలు చేకూరుస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లల వివాహాలను ఆర్థికంగా ఆదుకునేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ పథకాలు పేదింటి కుటుంబాలకు ఎంతో ఉపకరిస్తున్నాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్యా గోవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ పరమేశం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.












