ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని, గంటల తరబడి రోడ్లపై నిలిపివేయవద్దని సూచించారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన ట్రాఫిక్ జామ్‌పై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాన్వాయ్ కోసం ప్రజల పనులకు ఆటంకం కలిగించవద్దని, ఎదురుగా వచ్చే వాహనాలను కూడా ఆపి ఇబ్బంది పెట్టొద్దని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
సీఎం ఆదేశాల నేపథ్యంలో, డీజీపీ సీవీ ఆనంద్ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ట్రాఫిక్ సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం త్వరలో ‘ట్రాఫిక్ బ్యూరో’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపకుండా, సింగిల్ లైన్లో వాహనాలను పంపే ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించారు. రద్దీ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఎయిర్‌పోర్టు పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని, సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని డీజీపీ సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ నివారణపై దృష్టి సారించాలని, శాంతిభద్రతల విభాగం కూడా ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని తెలిపారు.











