రానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)–2026 కార్యక్రమం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో ప్రతి అర్హులైన ఓటరు పాల్గొనాలని సూచించారు. ఓటరు జాబితాల శుద్ధీకరణ, పారదర్శకత, ఖచ్చితత్వం కోసం ఈ ప్రక్రియ అత్యంత ముఖ్యమని తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు, 2002 ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు తమ వివరాలను 2025 ఓటరు జాబితాతో అనుసంధానం (మ్యాపింగ్) చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు జాబితాల ఖచ్చితత్వం పెరుగుతుందని ఆయన వివరించారు.
జిల్లాలోని ప్రతి ఓటరు తమ కుటుంబ సభ్యుల ఓటర్ ఐడీ వివరాలతో, తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న బూత్ లెవల్ ఆఫీసర్ (BLO)ను సంప్రదించి మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచనలు జారీ చేశారు. కుటుంబంలోని ఓటర్లందరి వివరాలను ఒకేసారి అందజేస్తే ప్రక్రియ వేగవంతమవుతుందని తెలిపారు.
ప్రస్తుతం, 2002 ఓటరు జాబితాలోని వివరాలను 2025 ఓటరు జాబితాలోని వివరాలతో సరిపోల్చి, ధృవీకరించే కార్యక్రమం జరుగుతోందని కలెక్టర్ తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు భాగస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎల్ఓలు ఇంటింటి సందర్శనలు నిర్వహిస్తూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారని, ప్రజలు వారికి పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సందేహాలుంటే సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు లేదా బీఎల్ఓలను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.












