జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., సూచించారు. శనివారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీఎంఅండ్హెచ్ఓతో కలిసి పలు సమస్యలపై చర్చించిన కమిషనర్, గతంలో చోటుచేసుకున్న సంఘటనల పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ వ్యవస్థను క్రమబద్ధీకరించడం, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా పర్యవేక్షణ పెంపు వంటి అంశాలపై అధికారులతో సవివరంగా చర్చించారు. చిన్నారుల భద్రత, అనాథల సమస్యలు, అనుమతి లేకుండా వాహనాలు నిలిపివేయడం వంటి విషయాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఆసుపత్రి వెలుపల ఉన్న దుకాణాల కారణంగా అంబులెన్సుల రాకపోకలకు ఆటంకం కలుగుతున్నదని సూపరింటెండెంట్ కమిషనర్ దృష్టికి తీసుకురాగా, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.
మొత్తంగా ఆసుపత్రిలో భద్రత, క్రమశిక్షణ, సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలు త్వరలో అమలు చేయనున్నట్లు తెలిపారు.












