మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ఒడ్డున గుర్తుతెలియని వ్యక్తులు అమర్చిన పేలుడు పరికరాల వల్ల ఆదివారం పలు బర్లకు తీవ్ర గాయాలయ్యాయి. వన్యప్రాణులను వేటాడేందుకు ఈ పరికరాలను అమర్చినట్లు భావిస్తున్నారు.
పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లినప్పుడు, మేత కోసం తిరుగుతున్న బర్లలో కొన్ని ఈ పేలుడు పరికరాలను తినడంతో అవి పేలిపోయాయి. ఈ ఘటనలో పలు బర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పశువులను సమీపంలోని పశువైద్యుల వద్ద చికిత్స కోసం తరలించారు.
ఈ సంఘటనతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల అమాయక పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అటవీ శాఖ అధికారులు, పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే ప్రాంతంలో మూడు రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే జరిగినట్లు సమాచారం. పేలుడు పరికరాలను తినడం వల్ల నాలుగు మేకలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జన్నారం ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.











