జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం గుండాల మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ సేవల నాణ్యతపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ఏకలవ్య పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటి పలు సంస్థలలో గుర్తించిన లోపాలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులకు, ఔట్సోర్సింగ్ ఏజెన్సీలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
కలెక్టర్ అంకిత్ తన పర్యటనలో భాగంగా ముతాపురం గ్రామంలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, ఆర్ఓ ప్లాంట్, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి, వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత, పాల సరఫరా, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై వివరాలు సేకరించారు. పాఠశాలలో పరిశుభ్రత లోపాలు, వంటగదిలో అస్వచ్ఛత, సిబ్బంది కొరత, మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం వంటి సమస్యలను గుర్తించి, కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఔట్సోర్సింగ్ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్, "రెండు రోజుల్లో పాఠశాలలో ఉన్న అన్ని లోపాలను సరిదిద్దాలి. లేదంటే ఏజెన్సీ గుర్తింపు రద్దు చేసి, బ్లాక్‌లిస్ట్‌లో చేరుస్తాం" అని హెచ్చరించారు. ప్రతి భోజనం తాజాగానే వండించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం, గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, 108 అంబులెన్స్ సిబ్బందితో మాట్లాడారు. మందుల గది, ఇంజెక్షన్ రూమ్, స్టోర్ రూమ్, రక్త పరీక్షల గది వంటి విభాగాలను పరిశీలించి, సిబ్బంది హాజరు, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. డెంగ్యూ పరీక్ష కిట్ల లభ్యత గురించి ఆరా తీసి, అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
మందుల పంపిణీ గదిలో సిబ్బంది లేకపోవడంపై కలెక్టర్ ఆరా తీశారు. మందుల నిల్వ గదిలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం కల్పించడం, ఫార్మసిస్ట్‌ను నియమించాలని ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని, వేసవి దృష్ట్యా వడదెబ్బకు అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. నూతనంగా నిర్మిస్తున్న తహసీల్దార్ కార్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల నిర్మాణ పనులను కూడా సమీక్షించారు. కస్తూరిబా పాఠశాలలో రెండేళ్లుగా పనిచేయని ఆర్ఓ ప్లాంట్‌ను త్వరగా బాగు చేయాలని ఆదేశించారు.











