ఇన్పైర్ సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ (ఐ.ఎస్.ఆర్.డి) ఆధ్వర్యంలో బీబీపేట్ మండల మహిళా సమాఖ్యలో మానసిక ఆరోగ్యం, మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తే పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని, మాదకద్రవ్యాల వినియోగం కుటుంబాలను నాశనం చేస్తుందని హెచ్చరించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయతతో కూడిన వాతావరణం పిల్లల ఆత్మవిశ్వాసంతో ఎదుగుదలకు దోహదపడుతుందని అమృత రాజేందర్ వివరించారు. తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను అర్థం చేసుకుని, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలని సూచించారు.
యువత సామాజిక మాధ్యమాల ప్రభావానికి గురికాకుండా వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులను క్లిక్ చేయడం, బ్యాంకింగ్ వివరాలు పంచుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, తద్వారా నష్టాన్ని నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాసులు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్రవంతి, గ్రామ సంఘాల అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు.











