ఖమ్మం అర్బన్ మండలం, వెలుగూమట్ల గ్రామంలోని భూదాన్ యజ్ఞం బోర్డు భూముల ఆక్రమణ, అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
భూదాన్ యజ్ఞం బోర్డుకు చెందిన 31.04 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించారని, ఆక్రమణదారులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. భూదాన్ భూములను ఇళ్ల స్థలాలుగా కేటాయించే విషయంలోనూ వివాదాలున్నాయని, అక్రమంగా పట్టాలు జారీ చేసినట్లు ఆరోపణలున్నాయని తెలిపారు.
ఈ వ్యవహారంలో అప్పటి భూదాన్ యజ్ఞం బోర్డు చైర్మన్ జి. రాజేందర్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. భూములను స్వాధీనం చేసుకుని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు.
ఇటీవల అధికారులు వెలుగూమట్ల గ్రామంలోని గుడిసెలను తొలగించి, కొంతమందికి ఇళ్ల స్థలాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నారని, అయితే అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామసభ నిర్వహించి, లబ్ధిదారుల జాబితాను ఖరారు చేయాలని సూచించారు.











