అమెరికా మరియు ఇరాన్ మధ్య జరగాల్సిన రెండో దశ శాంతి చర్చలు ఇరాన్ వైఖరితో అనిశ్చితిలో పడ్డాయి. రేపు ఇస్లామాబాద్‌లో ప్రారంభం కావాల్సిన ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించింది.
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNA తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా వైఖరి, అసంబద్ధ షరతులపై ఇరాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా విధించిన నౌకా దిగ్బంధం ఒప్పంద ఉల్లంఘనేనని ఆరోపించింది. ఈ నేపథ్యంలో, చర్చల భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి.
అమెరికా బృందం ఇవాళ సాయంత్రానికి పాకిస్తాన్ చేరుకోనుంది. ఈ బృందంలో జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ వంటి ప్రముఖులు పాల్గొనాల్సి ఉంది. అయితే, ఇరాన్ వైఖరి మారకపోతే చర్చలు ముందుకు సాగే అవకాశం తక్కువ.
ఏప్రిల్ 22తో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణపై కూడా చర్చలు కీలకం కానున్నాయి. కానీ, ఇరాన్ తాజా ప్రకటనతో ఈ ప్రక్రియపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇరాన్ ప్రకటనలో, అమెరికా తీరు కారణంగానే తాము హర్మూజ్ జలసంధిని మూసివేయాల్సి వచ్చిందని పేర్కొంది. నౌకా దిగ్బంధం విషయంలో అమెరికా వెనక్కి తగ్గడం లేదని, ఇది ఒప్పందానికి విఘాతం కలిగిస్తుందని ఇరాన్ హెచ్చరించింది.











