మిజోరాంలో డ్రగ్స్, అక్రమ ఆయుధాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశించారు. ఆయన రాష్ట్రంలో కేంద్ర ప్రాధాన్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మిజోరాం పోలీసులతోపాటు అసోం రైఫిల్స్ అధికారులను ఉద్దేశించి, బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల నుండి రాష్ట్రంలోకి అక్రమంగా డ్రగ్స్, ఆయుధాల సరఫరా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
మిజోరాం పర్యటనలో భాగంగా, మంత్రి బండి సంజయ్ కుమార్ సియాహ జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రాధాన్య కార్యక్రమాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో మాట్లాడుతూ, విద్య, వైద్య రంగాల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లు, రైల్వే, టెలి కమ్యూనికేషన్ రంగాల్లో అభివృద్ధితో పాటు, ఆయిల్ పాం సాగు విస్తీర్ణ లక్ష్యాన్ని చేరుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, సైబర్ క్రైం కేసుల నమోదుపై కూడా మంత్రి ఆరా తీశారు. సియాహా జిల్లా అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని, అవసరమైన ప్రతిపాదనలను రూపొందించి పంపాలని సంబంధిత జిల్లా కలెక్టర్కు సూచించారు.
ఇదే సమయంలో, మిజోరాం రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిసి సన్మానించారు. మిజోరాంలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన నేతలతో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, కరపత్రాల పంపిణీ, హోర్డింగుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.











