చింతూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో (సిహెచ్సి) మంగళవారం, పుట్టుకతోనే తీవ్రమైన లోపాలతో ఒక శిశువు జన్మించింది. గర్భంలోనే శిశువుకు మెదడు, పుర్రె ఎముకల అభివృద్ధిలో లోపాలను గుర్తించిన వైద్యులు, తల్లి ప్రాణాలను కాపాడేందుకు అత్యవసర సిజేరియన్ నిర్వహించారు.
చింతూరు మండలంలోని ఎర్రంపేట గ్రామానికి చెందిన గర్భిణీ, సుమారు ఆరు నెలల గర్భంతో సిహెచ్‌సికి వచ్చినప్పుడు, శిశువులో తీవ్రమైన అభివృద్ధి లోపాలను వైద్యులు గుర్తించారు. మెదడు, పుర్రె ఎముకలు సరిగా అభివృద్ధి చెందని (అనెన్సఫెలీ) పరిస్థితి కారణంగా శిశువు జన్మించిన వెంటనే మరణించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
తల్లి ఆరోగ్యం కూడా విషమించడంతో, వైద్య బృందం తక్షణమే స్పందించి లోయర్ సెగ్మెంట్ సిజేరియన్ సెక్షన్ (ఎల్ఎస్సిఎస్) ద్వారా శస్త్రచికిత్స నిర్వహించింది. ఈ క్లిష్టమైన ప్రక్రియ ద్వారా తల్లి ప్రాణాలను విజయవంతంగా కాపాడగలిగారు.
ఈ అరుదైన కేసును విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, సహాయక సిబ్బందిని ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది. ఈ సంఘటన వైద్యుల నిబద్ధతకు, నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచింది.









