రాష్ట్ర ప్రభుత్వ ‘99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా ‘వెల్ఫేర్ వీక్’ (సంక్షేమ వారం) నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజుల పాటు విద్యార్థుల సంక్షేమం, వారి ప్రతిభను వెలికితీయడం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ఆదేశాల మేరకు, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సబ్యసాచి ఘోష్ వారోత్సవాల షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేశారు.
వారంలో ప్రతిరోజూ ఒక్కో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్ 20న పరిశుభ్రత డ్రైవ్, 21న టాలెంట్ ఫెస్ట్, 22న మరమ్మతుల అంచనా, 23న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశాలు, 24న నైపుణ్యాభివృద్ధి సదస్సులు, 25న సమ్మర్ క్యాంపులు, 26న ‘బడి బాట’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రణాళిక కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన, పారదర్శకతను పెంచుతుందని తెలిపారు. సమర్థవంతమైన అమలుతో పాటు, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని సబ్యసాచి ఘోష్ కలెక్టర్లకు సూచించారు.







