కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనిని తక్షణమే అరికట్టాలని యూనైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (యూఎస్ఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి నాగళ్ళ సతీష్ డిమాండ్ చేశారు.
పట్టణంలోని కొన్ని పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు పెంచుతున్నాయని, ఈ విషయాన్ని పలుమార్లు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ఆయన ఆరోపించారు. ఎస్ఎస్సీ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల హాల్‌టికెట్ల జారీ సమయంలో ఫీజుల కోసం ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
ఫీజుల పెంపు పేరెంట్స్ కమిటీ ఆమోదంతో లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరగాలని, 2020 నుంచి 2026 వరకు ఫీజుల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి జీవో జారీ చేయలేదని తెలిపారు. అయినప్పటికీ కొన్ని పాఠశాలలు 30 శాతం వరకు ఫీజులు పెంచాయని పేర్కొన్నారు.
ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయకపోతే పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై విచారణ జరపాలని యూఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేసింది.


