ప్రేమాక్షరి పుస్తకావిష్కరణ వేదికపై తెలుగు విశ్వవిద్యాలయం ఫోక్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన బోనాల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో కూడిన ఈ ప్రదర్శన, సంప్రదాయ కళల వైభవాన్ని చాటి చెప్పింది.
శనివారం నాడు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన ప్రేమాక్షరి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో, లలిత కళా పీఠం విద్యార్థులు అద్భుతమైన బోనాల ప్రదర్శనను అందించారు. ఈ ప్రదర్శనలో భాగంగా, విద్యార్థులు పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలు, గజ్జెల గలగలలతో కూడిన సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు.
విద్యార్థులు 'లక్ష్మమ్మ, పోచమ్మకు బోనం చేయంగా..' అంటూ చేసిన నృత్యాలు, 'రావే రావే పెద్దమ్మా..' వంటి పాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. శివసత్తుల పూనకాలు, డప్పుల మోతలు ఆడిటోరియం ప్రాంగణాన్ని ఉర్రూతలూగించాయి. పీఠాధిపతి డా. విజయ్ పాల్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు ప్రదర్శించిన ఈ కళాఖండం, పలువురి ప్రశంసలు అందుకుంది.
తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షులు వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ, తాను జీవితంలో అత్యంత శ్రద్ధగా చూసిన ప్రదర్శనలలో ఇది ఒకటి అని అభివర్ణించారు. విద్యార్థుల నృత్యం, గానం అద్భుతంగా ఉన్నాయని, కాలానికి అనుగుణంగా వారు ప్రదర్శించిన తీరు ప్రశంసనీయమని కొనియాడారు. సీనియర్ సంపాదకులు కె. శ్రీనివాస్ కూడా కళ ఒక కమ్యూనికేషన్ సాధనమని, విద్యార్థుల ప్రదర్శన ఆద్యంతం అలరించిందని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, సామాజిక తదితర శాస్త్రాల పీఠం డీన్ ఆచార్య బీ.హెచ్. పద్మప్రియ, ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. వారు కూడా విద్యార్థుల ప్రతిభను మనస్ఫూర్తిగా అభినందించారు. లంబాడీ డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.











