సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
సంగారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ సాయి కృష్ణ హై స్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ఆకస్మికంగా సందర్శించారు.
ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ విధానం, హాల్ ఏర్పాట్లు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షలు సజావుగా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆమె తెలిపారు.
పరీక్షా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్లు పరీక్షా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేని వ్యక్తులను, ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని ఆమె సూచించారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చూడాలని కలెక్టర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో అధికారుల అప్రమత్తతను ఆమె కోరారు.












