మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సోమవారం శామీర్‌పేటలోని తెలంగాణ ప్రభుత్వ క్రీడా పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు.
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు కలెక్టర్ మను చౌదరి ఈ తనిఖీ చేపట్టారు. హకీంపేట్ క్రీడా పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షా గదుల్లో విద్యార్థుల పనితీరును గమనించారు.
పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని ఆదేశించారు.
పరీక్షార్థులకు తాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య సదుపాయాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకున్నారు.
కేంద్రానికి కేటాయించిన విద్యార్థుల సంఖ్య, హాజరు శాతం, గైరుహాజరైన వారి వివరాలను రిజిస్టర్ల ద్వారా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ కుమారి, తహసీల్దార్ సుచరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.











